రామేశ్వరం వెళ్లిన శనేశ్వరుడు వదలలేదని ఒక సామెత. శివుడికి శని తప్పలేదంటారు పెద్దలు. ఏలినాటి శని అని, అర్ధమ శని వారి కర్మలను బట్టి శని భగవానుడు వారిని పీడిస్తాడు. ఈ శని బాధలను తగ్గించడానికి లేదా తప్పించుకోవడానికి, శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని, మెప్పించే రోజు శని త్రయోదశి. త్రయోదశి తిది వచ్చే శనివారం నాడు శని త్రయోదశి అంటారు. ఈ రోజు అంటే శని దేవుడికి ప్రీతికరమైన రోజు.
స్వయంగా శ్రీమహావిష్ణువే గరుడపురాణంలో గరుత్మంతునికి శని దోషాలు పోవాలంటే, తెలిసీతెలియక చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి శని త్రయోదశి నాడు ప్రత్యేకమైన దీపాలను వెలిగించాలన్నాడు. అవేంటంటే, పొట్టుతీయని నల్ల మినుముల పొడిని, నల్ల నువ్వుల పొడిని, నల్ల బెల్లం పొడిని, రాళ్ల ఉప్పు పొడి అన్నిన్నిటిని తీసుకొని రెండు ప్రమిదలు చేసుకోవాలి.
శని త్రయోదశినాడు సాయంత్రం 5.15 నుండి 5.45 మధ్యలో రెండు రెండు తమలపాకులు తీసుకొని ఇంటిలో పడమర దిక్కున పక్కపక్కన తమలపాకుల మీద ప్రమిదలు పెట్టి దానిలో ఆముదం, గేదె నెయ్యి, నువ్వుల నూనె కలిపి పోయాలి. ఒక ప్రమిదలో 4 తెల్ల వత్తులు, ఇంకో ప్రమిదలో 4 నల్ల వత్తులు వేసి దీపం వెలిగించాలి. శని త్రయోదశినాడు శని దేవునికి నల్ల నువ్వుల అభిషేకం, బెల్లం నైవేద్యం, నల్ల వస్త్రాలు సమర్పించిన లేదా అవి దానం చేసిన ఎలాంటి శని దోషాలైనా పోతాయి.